షవ్వాల్ నెలలోని 6 దినాల ఉపవాసాల ప్రాధాన్యత
వివరణ
రమదాన్ నెల ఉపవాసాల తర్వాత, షవ్వాల్ నెలలో కూడా ప్రతి ఒక్కరూ ఆరు దినాల పాటు ఉపవాసాలు ఉండటానికి ప్రయత్నించవలెను. వీటిని షవ్వాల్ నెలలో ఎప్పుడైనా ఉండవచ్చును. వీటికి ఉన్న ప్రాధాన్యత గురించి ఇక్కడ చర్చించబడినది.
-
1
షవ్వాల్ నెలలోని 6 దినాల ఉపవాసాల ప్రాధాన్యత
PDF 61.3 KB 2019-05-02
-
2
షవ్వాల్ నెలలోని 6 దినాల ఉపవాసాల ప్రాధాన్యత
DOC 1.8 MB 2019-05-02
పూర్తి వివరణ
షవ్వాల్ నెలలో పాటించవలసిన ఉపవాసాల ప్రాధాన్యత
షవ్వాల్ నెలలో పాటించవలసిన 6 దినాల ప్రత్యేక ఉపవాసాలకు ఇస్లాం ధర్మం ఎలాంటి ప్రాధాన్యతనిస్తున్నది? వాటిని తప్పని సరిగా పాటించ వలెనా?
సకల స్తోత్రములు, ప్రశంసలు అల్లాహ్ కే చెందును.
రమదాన్ నెల మొత్తం తప్పని సరిగా ఉపవాసాలు పాటించిన తర్వాత, షవ్వాల్ నెలలోని 6 దినాల ఉపవాసాలు ఉండటమనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అధిక ప్రాధాన్యత ఇచ్చిన ప్రత్యేక ఆచరణల కోవకు (సున్నహ్ ముస్తహబ్) చెందినవి. అంతే కాని అవి తప్పని సరి ఉపవాసాలు అంటే వాజిబ్ ఉపవాసాలు కావు. కాబట్టి ముస్లింలు షవ్వాల్ నెలలో 6 రోజులు ఉపవాసం ఉండటానికి తప్పక ప్రయత్నించవలెను. వీటిలో మహోన్నతమైన శుభాలు మరియు అపరిమితమైన పుణ్యాలు ఉన్నాయి. ఒక సహీహ్ హదీథ్ లో తెలుపబడిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధన ప్రకారం ఎవరైతే రమదాన్ నెల ఉపవాసాల తర్వాత షవ్వాల్ నెలలోని ఆరు దినాలు కూడా ఉపవాసం ఉంటారో, వారు సంవత్సరం మొత్తం ఉపవాసం ఉన్నట్లుగా నమోదు చేయబడతారు. అబూ అయ్యూబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీథ్ ప్రకారం, ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: “ఎవరైతే రమదాన్ లో ఉపవాసం ఉంటారో మరియు ఆ తర్వాత షవ్వాల్ నెలలోని ఆరు దినాల ఉపవాసాలు కూడా పూర్తి చేస్తారో, వారు జీవితాంతం ఉపవాసం ఉన్నట్లే." (ముస్లిం హదీథ్ గ్రంథం, అబూ దావూద్ హదీథ్ గ్రంథం, అత్తిర్మిథీ హదీథ్ గ్రంథం, అన్నిసాయి హదీథ్ గ్రంథం మరియు ఇబ్నె మాజా హదీథ్ గ్రంథం)
దీనినే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా విశదీకరించారు: “ఈద్ అల్ ఫిత్ర్ (అల్ ఫిత్ర్ పండుగ దినం తర్వాత) ఎవరైతే ఆరు దినాలు ఉపవాసం ఉంటారో వారు సంవత్సరాన్ని పూర్తి చేసిన వారవుతారు: (ఎవరైనా ఒక మంచి పని చేసినట్లయితే అది 10 మంచి పనులు చేసినట్లు కదా అంటే ప్రతి పుణ్యానికి 10 రెట్ల పుణ్యాలు లభించునని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వేరొక హదీథ్ లో ఉపదేశించినారు)." ఇంకో హదీథ్ ఉల్లేఖన ప్రకారం: “ప్రతి శుభకార్యానికి అల్లాహ్ 10 శుభకార్యాలంతటి ప్రతి ఫతిఫలం ప్రసాదించును. కాబట్టి ఒక నెల ఉపవాసం ఉండటమంటే 10 నెలల పాటు ఉపవాసం ఉన్నట్లే మరియు 6 దినాల ఉపవాసాలు సంవత్సరాన్ని పూర్తి చేస్తాయి." (అన్నిసాయి హదీథ్ గ్రంథం మరియు ఇబ్నె మాజా హదీథ్ గ్రంథం. ఇంకా సహీహ్ అల్ తర్గీబ్ వల్ తర్హీబ్ గ్రంథంలోని 1/421). ఇదే హదీథ్ ను ఇబ్నె ఖుజైమా రదియల్లాహు అన్హు క్రింది పదాలతో ఉల్లేఖించారు: “రమదాన్ నెలలోని ఉపవాసాలు తమ లాంటి పది రెట్ల పుణ్యాలను తీసుకుని వచ్చును మరియు ఈ 6 దినాల ఉపవాసాలు రెండు నెలల ఉపవాసాల పుణ్యం తీసుకుని వచ్చును, మరియు ఆ విధంగా సంవత్సరం మొత్తం ఉపవాసాలు ఉన్నట్లగును."
హంబలీ మరియు షాఫయీ పండితులు ఇలా వివరించారు - రమదాన్ నెల ఉపవాసాల తర్వాత ఉండే షవ్వాల్ నెలలోని 6 దినాల ఉపవాసాలు కలిసి, సంవత్సరం మొత్తపు విధి (తప్పనిసరి) ఉపవాసాలకు సరిపోతాయి. ఎందుకంటే పుణ్యకార్యాలకు వర్తించే గుణింతం (పది రెట్లు) ఐచ్ఛిక ఉపవాసాలకు కూడా వర్తించును, కారణం ప్రతి శుభకార్యానికి లభించే పుణ్యం, అలాంటి పది పుణ్యాలను సంపాదించి పెట్టును.
షవ్వాల్ నెలలోని 6 దినాల ఉపవాసాల ఇంకో ప్రత్యేకత ఏమిటంటే, అవి రమదాన్ నెల తప్పని సరి ఉపవాసాలలో ఏవైనా తప్పిదాలు జరిగి ఉంటే వాటిని భర్తీ చేస్తాయి. ఎవ్వరూ తమ ఉపవాసాలపై చెడు ప్రభావం చూపే తప్పిదాలకు, పాపపు పనులకు అతీతులు కారు కదా. ప్రతిఫల దినం నాడు అంటే తీర్పు దినం నాడు తక్కువైన విధి (తప్పని సర) ఆచరణలను కొన్ని ఐచ్ఛిక ఆచరణలతో భర్తీ చేయటం జరుగును. ఒకసారి దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: “తీర్పుదినం నాడు మొట్ట మొదట తమ నమాజుల విషయంలో ప్రజల లెక్కలు చూడబడును. మహోన్నతుడైన మన ప్రభువు అన్నీ తెలిసియున్ననూ, తన దైవదూతలతో ఇలా పలుకును – 'నా దాసుని నమాజును చూడండి, అది పూర్తయినదా లేక అసంపూర్తిగా ఉన్నదా.' ఒకవేళ అది సంపూర్ణంగా ఉంటే, సంపూర్ణంగా ఉన్నట్లు నమోదు చేయబడును. మరియు ఒకవేళ ఏదైనా తక్కువైనట్లయితే, అల్లాహ్ ఇలా ఆజ్ఞాపించును, 'నా దాసుడు ఏవైనా ఐచ్ఛిక (నఫిల్) నమాజులు చేసి ఉన్నాడేమో చూడండి.' ఒకవేళ అతను ఏవైనా ఐచ్ఛిక (నఫిల్) నమాజులు చేసి ఉన్నట్లయితే, (అల్లాహ్) ఇలా పలుకును, అతని యొక్క ఐచ్ఛిక (నఫిల్) ఆచరణలతో తప్పని సరి ఆచరణల లెక్కను పూర్తి చేయండి.' ఆ తర్వాత అతని ఆచరణలన్నింటితో ఇదే విధంగా వ్యవహరించబడును." (అబూ దావూద్ హదీథ్ గ్రంథం). అల్లాహ్ యే సర్వలోక జ్ఞానవంతుడు.
షేఖ్ ముహమ్మద్ సాలెహ్ అల్ మునజ్జిద్